Home » Uncategorized » వృత్తి నైపుణ్యాలే వికాస సోపానాలు

వృత్తి నైపుణ్యాలే వికాస సోపానాలు

వృత్తి నైపుణ్యాలే వికాస సోపానాలు

అమెరికా ప్రెసిడెంట్ ఒబామ 2009 లో అధికారంలోకి రాగానే దేశం ఆర్దిక మాంద్యం నుండి బయట పడ్డంకోసం, 10 శాతానికి పెరిగిపోయిన నిరుద్యోగాన్ని నిర్మూలించడంకోసం బెయిల్ అవుట్ పాకేజ్ పేరిట ఆర్దిక ప్రోత్సాహక ప్రణాళికను ప్రకటించి, ఆర్థిక వృద్ధి పునరుద్ధరించడానికి అవసరమైన విశ్వాసం క్రమంగా కలిగించి ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టాడు. అమెరికాలో మన లాగ గ్రామం, పట్టణం, నగరం లాంటి వైవిద్యం తో కూడిన సమాజం లేదు. వారికి ఒక్కటే ప్లాన్ కంపెనీలను పరిపుష్టం చేయడం, ప్రజలకు నైపుణ్యాలు నేర్పి ఉద్యోగాలు కల్పించడంతో  సరిపోయింది. కాని మనకు వైవిద్యం తో వర్ణవ్యవస్థతో కూడుకున్న  గ్రామం, పట్టణం, నుండి కాస్మోపాలిటన్‌ నగరం వరకు వున్న తెలంగాణ సమాజం అవసరాలు తీర్చే విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం వుంది.

1200 మంది ప్రజల ప్రాణ త్యాగాలతో, మారుమూల గ్రామం నుండి హైదరాబాద్ వరకు వేలాది మంది ప్రజల పోరాట త్యాగాలతో తెలంగాణ ఏర్పడ్డది. మారుమూల గ్రామ రైతు కూలి, రైతు, వృత్తి పనుల వాళ్లు, పట్టణ నిరుద్యోగులు, ఉద్యోగస్థులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమల వాళ్లు, సినిమా వాళ్లు ఇలా అన్ని రకాల ప్రజలు  ఎన్నో ఆశలతోటి మా జీవితాలు కొంత అయినా మారుతాయని ఎదురు చూస్తున్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే రంగాలను ఒకసారి చూస్తే మొదటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెండోది ప్రభుత్వ రంగం లోని టీచర్, లెక్చరర్, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి పోస్టులు, మూడోది చిన్న, మద్య తరహా మెకానికల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు. భవన నిర్మాణం లో కూడ మరికొంత మందికి ఉపాధి దొరుకుతుంది.

అమెరికా, యూరోపియన్ వంటి అభివృద్ది చెందిన దేశాలు, పారిశ్రామిక విప్లవంతో మనం ఇప్పుడు అనుభవిస్తున్న కరెంట్, కార్లు, వంటి ఎన్నో రకాల వస్తువులు కనిపెట్టి, పేపర్ ఉపయోగించి వ్యాపార కార్యకలాపాలు చేసేవారు. ప్రస్తుత ప్రపంచీకరణ వల్ల అలాంటి బహుళ జాతి కంపెనీలు తక్కువ ధరకు ముడి సరకు దొరికే దేశం నుండి ముడి సరకు దిగుమతి చేసుకోని, తక్కువ ఖర్చుతో నిపుణులు దొరికే మరో దేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి, మిగిలిన దేశాల్లో వచ్చే డిమాండ్ ప్రకారం అమ్ముకుంటారు. వివిధ దేశాల చట్టాలు, టాక్స్ లు, వివిధ దేశాల్లోని వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తు సరఫరా చేయడం, సంక్లిష్టంగా మారి, ఇలాంటి సంక్లిష్ట పరిశ్రమల నిర్వహణ పేపర్ ద్వారా నిర్వహించటం కష్టసాధ్యమయి  సాఫ్ట్ వేర్ కనిపెట్ట బడ్డది. ఇలాంటి బహుళజాతి కంపెనీల అన్ని దేశాల్లోని డిపార్ట్‌మెంట్ లు, ముడి సరుకు సరఫరా దారు (సప్లయర్), వస్తు పంపిణీదారుల (డిస్ట్రిబ్యూటర్) కార్యకలాపాలన్నీ అనుసంధించడానికి ఓరకిల్ అప్లికేషన్స్, SAP లాంటి సాఫ్ట్ వేర్  లు ఉపయోగపడుతున్నాయి.  ఇవాళ ప్రతీ వ్యాపార, ప్రభుత్వ కార్య కలాపం సాఫ్ట్ వేర్ లేకుండా పేపర్ ఉపయోగించి చేయడం ఎప్పుడో మర్చిపోయింది సమాజం. ప్రతీ కంపెనీ తన కార్యకలాపాల, వస్తు వుత్పత్తి, సేవల గురించి చెప్పుకోవడానికి వెబ్ సైట్ పెట్టుకోవడం సర్వసాధారణం అయ్యింది. ఒకప్పుడు తన వీధి లోని వారికి వస్తు సరఫరా చేసిన దుకాణ దారుడు, ఇవ్వాళ ఇ-భే, అమెజాన్‌ లాంటి వెబ్ సైట్లు, సెల్ ఫోన్ అప్లికేషన్స్ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా  వినియోగదారులకు తన సేవలు అందిస్తుండు.

 ఇలాంటి సాధారణ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలు ఉపయోగించే సాఫ్ట్ వేర్ తయారీకి, సాఫ్ట్ వేర్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్ ఇంజనీర్లు, నిపుణులు తక్కువ ఖర్చుతో లభించే వారిలో మన దేశం మొదటిది. ఇలాంటి కంపెనీల్లో పని చేస్తున్నవారు, ప్రస్తుతం మన తెలంగాణ నుండి వందలాది మంది ఉన్నారు. ఇలాంటి కంపెనీలకు అవసరమైన నిపుణులను తయారుచేయడానికి మనకు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నయ్. అలాగే ఓరకిల్ అప్లికేశన్స్, SAP, జావా, డాట్ నెట్, టెస్టింగ్, వెబ్ డెవలప్ మెంట్, ఫోటోషాప్ వంటి సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ నేర్పడానికి కోచింగ్, ప్రోగ్రామింగ్  లో శక్షణ ఇచ్చి నిపుణులుగా తర్ఫీదు ఇవ్వడానికి, ఉద్యోగంలో నిలదొక్కుకోడానికి కావలసిన ఇంగ్లీష్ మాట్లాడే విధానం, సాఫ్ట్ స్కిల్స్ లో కోచింగ్ ఇవ్వడానికి  హైదరా బాద్ లోని అమీర్ పేట్ వంటి ప్రాంతాల్లో, మరీ చెప్పాలంటే రాష్ట్రం లోని ప్రతీ మండల కేద్రంలో కూడా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లు ఉన్నాయి.  ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ స్థాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తయారు కావడానికి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నయ్. తక్కువ ధరకు దొరికే కంప్యూటర్లు, దానిలో ఇనస్టాల్ చేసుకోని నేర్చుకోవడానికి  ఓరకిల్ అప్లికేశన్స్, SAP, జావా, డాట్ నెట్, టెస్టింగ్ టూల్స్, సర్వర్ లాంటి సాఫ్ట్ వేర్ లు, ఇలా ప్రపంచంలో ఉపయోగించే అన్ని రకాల సాఫ్ట్ వేర్ లు, వీటిలో శక్షణ ఇవ్వడానికి కావలసిన అత్యుత్తమ ఫాకల్టి ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజిలను, ఈ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లను ఇంకా కొంచెం ఆర్గనైజ్డ్ గా, నాణ్యత తో, మార్పులను గమనిస్తూ వీటిని నిర్వహిస్తే ఎప్పటికి ప్రపంచంలో మన వారికి ఈ సాఫ్ట్ వేర్ రంగంలో డిమాండ్ ఉంటుంది.

 అదేవిధంగా ఒక యువ ఇంజనీర్ లేదా ఔత్సాహిక వేత్త ఒక ప్రపంచ స్థాయి సాఫ్ట్ వేర్ కంపెని, లేదా సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ లేదా కోచింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టాలనుకుంటే వారికి కావలసిన అన్ని రకాల మౌళిక సదుపాయాలు కంప్యూటర్ లు, కావలసిన సాఫ్ట్ వేర్ సహా, బిజినెస్ ఎనలిస్ట్, డెవలపర్, టెస్టర్ వంటి అన్ని రకాల నిపుణులైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు మనకు అందుబాటులో వున్నారు. ప్రభుత్వం నెలకొల్పిన ఇంకుబేటర్ ఫెసిలిటీని నిర్మాణాత్మకంగా లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేయిస్తే ఎందరో యువ ఇంజనీర్ లేదా ఔత్సాహిక వేత్తలను పారిశ్రామిక వేత్తలుగా మలిచి మన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించు కోవచ్చు.

 

మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేయాలంటే, చైనా లేదా సింగపూర్ వంటి చోట తయారు చేయిస్తారు.  మన దగ్గర అమీర్ పేట లో సాఫ్ట్ వేర్ నేర్చుకోవడానికి కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు వున్నట్లు చైనా లోని శాంజెన్ లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేయడానికి కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు, హైటెక్ సిటీ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు వున్నట్లు శాంజన్ లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేసే కంపెనీలు ఉంటాయి.

దీనికి ప్రధాన కారణం మొత్తం చైనీయులకు మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారికి కావలసిన ప్రాధమిక విజ్ఞానం అందుబాటులో వుంది. దానికి కారణం మావో 1958 నుండి 1961 వరకు గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పేరుతో గ్రామీణుల కు ఇనుము, స్టీల్ వంటి వాటిని తయారుచేయడానికి కావలసిన శిక్షణ ఇచ్చిండు. మావో నుండి ఇప్పటి వరకు చైనా వారు అనుసరించిన విధానం ఇదే.

మన దగ్గర కూడా యువ ఇంజనీర్ లు కొత్త సాఫ్ట్ వేర్ లను, కొత్త వస్తువులను కనిపెట్టడానికి, సహాయపడడానికి ప్రవేశపెట్టిన ఇంకుబేటర్ ఫెసిలిటీ కి అనుబంధంగా మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువులను ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారు చేయడానికి కావలసిన నైపుణ్యం పెంచుకోవడానికి కావలసిన మౌళిక సదుపాయాలైన మెషినరీ, టెస్టింగ్ పరికరాలు, శిక్షణ, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో వున్న టెక్నాలజిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి లోకలైజేశన్ చేయడానికి కావలసిన పరికరాలు కూడా సమకూరిస్తే సాఫ్ట్ వేర్ రంగానికి తోడు మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా నిలదొక్కుకొని నిరుద్యోగ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

అభివృద్ది చెందిన దేశాల్లో ఉపయోగించే  వ్యవసాయ సంబంద పనిముట్లు, పాల పరిశ్రమ  సంబంద పరికరాలు, ఇలా రోజూ వారి జీవితంలో ఉపయోగించే పనిముట్లు ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో, ఒక 100 సంవత్సరాల ముందంజలో వున్నారు. ఆ సాంకేతిక పరికరాలన్ని వారి పరిసరాలకు, వారి పద్దతులకు అనుగుణంగా తయారు చేయబడ్డాయి.  వాటిని ఎక్కువ ఖర్చుపెట్టి దిగుమతి చేసుకోవడం కాకుండా, వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి, టెక్నాలజీని దిగుమతి చేసుకొని స్థానికతను జోడించి మన రైతులకు, మన సమాజానికి ఉపయోగపడే విధంగా మనమే  తయారు చేసుకోగలిగితే  మనం కూడా ఒక పది సంవత్సరాల్లో ప్రపంచ స్థాయి నాణ్యతతో మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్స్ వస్తువులను తయారీ చేసే వారిలో ఒకరుగా ఉంటాము.

అంతే కాకుండా మన తెలంగాణ కు చెందిన  వారు వస్తు వుత్పత్తి  కంపెనీలు పెట్టి రాబోయే కాలంలో ప్రపంచ స్థాయి బహుళ జాతి కంపెనీలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఇనుప ఖనిజ గనులు చాలా ఉన్నాయి, మన సొంత కంపెనీలు వుంటె  మన వాల్లకు ఉపాధి, నైపుణ్యం పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

ఈ రోజు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ కి మూలమైన యూరప్, అమెరికా లోని చాలా కంపెనీలు, ఎక్కువ లాభాలు గడించడానికి, వారి దేశంలో కార్మికుల కు ఎక్కువ జీతం ఇవ్వలేక, కఠినమైన కార్మిక చట్టాల  వల్ల, పర్యావరణ సమస్య వంటి చాలా సమస్యల వల్ల, తక్కువ జీతంతో నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో వున్న చైనా లో వస్తూత్పత్తి  చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుంటున్నారు.

ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన మెకానికల్, ఎలక్ట్రానిక్స్ నిపుణులు, మౌళిక సదుపాయాలు మనం కలిగి ఉంటే ఇలాంటి కంపెనీలను మనం ఆకర్శించ వచ్చు, మన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.

 

గ్రామంలో ఉపాధి

మన చిన్న నాటి గ్రామం చూస్తే, తండ్రి నుండి కొడుకుకి నేర్పే విద్య పద్దతితో కుమ్మరాయన కొడుకు ఐదు వేల సంవత్సరాల క్రితం సింధూ నాగరికతలో కనిపెట్టిన అదే సారి (చక్రం), సలప ని వుపయోగించి కుమ్మరి పని చేస్తూ, మంగలాయన కొడుకు  మంగలి పని చేస్తూ, గౌండ్లాయన కొడుకు కల్లు తీస్తూ, దొర కొడుకు దొర పని చేస్తూ, మాలాయన కొడుకు జీతం వుండి పొలంల వందల సంవత్సరాల నుండి చేసిన పద్దతిలో వ్యవసాయం పని చేస్తూ, మాదిగాయన కొడుకు పార్ట్ టైం చెప్పులు కుడుతూ, ఫుల్ టైం దొర దగ్గర వెట్టి చేస్తూ,   బాపనాయన కొడుకు గుళ్లో మంత్రాలు చదువుతూ ఇలా అన్ని కులాల వాల్లు ఒకరికి ఇంకొకరు సహాయం చేసుకుంటూ డబ్బు అనే మాట లేకుండా వేలాది సంవత్సరాలు గడిపారు.

గ్రామంలోని వ్యక్తి మరో వృత్తి చేయాలంటే, గ్రామంలో మరో అవకాశం లేకుండేది, మరో వృత్తి చేయాలనుకుంటే పట్టణానికి పొయ్యి చదువు నేర్చుకోని పట్టణంలో మరో వృత్తి ని ఎన్నుకొనే వారు. ఈ రోజు మంత్రులుగా వున్న వారు, ప్రభుత్వంలో ఉన్న వారు చాలా వరకు ఇలా గ్రామం నుండి నగరానికి వచ్చిన వారే. దీంట్లో అన్ని కులాల వారు వున్నారు.

 స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ స్థూల ఉత్పత్తిలో 80% ఆదాయం గ్రామీణ వ్యవసాయం ద్వారా వచ్చిందే, 85 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధార పడేవారు. పంచ వర్ష ప్రణాళికలతో నెహ్రూ స్థాపించిన పరిశ్రమలతో, ఐటీ పరిశ్రమ తో వ్యవసాయం ద్వారా వచ్చే దేశ స్థూల ఉత్పత్తి 50% కి తగ్గించ కలిగాము కాని ఇప్పటికి వ్యవసాయం మీద ఆధారపడే వారు 65 శాతం జనాభా వున్నారు.

 గోరేటి వెంకన్న చెప్పినట్లు గ్రామం మొత్తం ధ్వంసం అయ్యి “పల్లె కన్నీరు పెడుతుంది”. ఒకప్పుడు తిండికి లేకున్నా వర్ణ వ్యవస్థ ద్వారా గ్రామంలో సోషల్ ఆర్డర్ ఉండేది. గ్రామం మొత్తం మారిపోయింది. ఇప్పుడు గ్రామంలో ప్రతీ ఇంటికి కరెంట్ వచ్చింది, ప్రతీ గ్రామానికి ఆటోలు తిరుగుతున్నయ్, తండ్రి నుండి కొడుకు చదువు స్థానంలో స్కూల్  ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా చదువు వచ్చింది, చిన్న చిన్న దుకాణాలు లు వచ్చినయ్, ఒకప్పటి లా దొర లేడు, దొరతనం లేదు. ఏ కులం వ్యక్తి ఆ కులం వృత్తి చేయడానికి ఇష్టపడట లేదు, మూడు వేల సంవత్సరాల నుండి ఒకే విధంగా, అవే పరికరాలు ఉపయోగించి చేసే వృత్తి పనులు కూలిపోయినయ్. కొత్త పరికరాలతో తయారయిన నాణ్యమైన రక రకాల వస్తువులు నగరం నుండి దిగుమతి చేసుకోని, దుకాణాల్లో కొంటున్రు. మొత్తంగా గ్రామ అవసరాలు వెయ్యి రెట్లు పెరిగినయ్, గ్రామస్తులు మారారు. కాని గ్రామ అవసరాలకు తగినట్లు ప్రభుత్వ పధకాలు, ప్రభుత్వ పద్దతి మారలేదు. గ్రామంలో ఏ ఇంట్లో అయినా, వ్యవసాయ మోటర్ కి అయినా కరెంట్ సమస్య వస్తే ఐటిఐ చేసిన ఎలక్ట్రీషియన్ మండలం నుండి తీసుకురావాలి. ఏదైనా ఆటోకి రిపేర్ వస్తే మండలంలో శిక్షణ లేని ఆటో గరాజ్ లో రిపేర్ చేసుకోవాలి, ఈ ఆటో రిపేర్ నేర్చుకోవాలంటే మండలంలోని గరాజ్ లో బాల కార్మికుడిగా చేరాలి. వడ్రంగం చేయడానికి కొత్త పనిముట్లు, పనిముట్లు ఉపయోగించే శిక్షణ లేదు.  ఇలా చాలా మంది వృత్తి పనుల వాల్లు, పెద్ద చదువులు చదివి వేరే వృత్తుల్లోకి పోలేక, పనులులేక నిరుద్యోగులు గా వున్నారు.

అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాల్లో వున్నటువంటి కమ్యూనిటీ కళాశాలల లాగా, మన తెలంగాణ ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో వృత్తి పాఠశాలలను నెలకొల్పి, నూతన పరికరాలు   ఉపయోగించి వృత్తులను, ఎలక్ట్రీషియన్, ఆటో రిపేర్ వంటి గ్రామానికి కావలసిన పనులను  గ్రామీణులకు నేర్పిస్తే మారిన పరిస్థితులకు అనుగుణంగా గ్రామ అవసరాలు తీరడం తో పాటు గ్రామ నిరుద్యోగాన్ని కొంత మేర తీర్చి,  వ్యవసాయం పై ఆధారపడే వారిని  కొంత మేర తగ్గించ వచ్చు.

నూతన పనిముట్లు ఉపయోగించి వృత్తి పనులు నేర్చుకున్నవారికి ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే, అంటే కార్పెంటర్ పని నేర్చుకున్న వారికి పనిముట్లు కొని ఇస్తే, ముడి సరుకు చెట్లు గ్రామంలో దొరుకుతుంది కాబట్టి, అతను వాటిని ఉపయోగించుకోని మంచి బల్లలు, కుర్చీలు వంటి వాటిని తయారుచేసి పట్టణానికి సరఫరా చేయగలడు, ఇలాగే మిగిలిన వృత్తులు వారు అభివృద్ది చెందగలరు. ఇలా ఒక 10 సంవత్సరాల్లో ప్రతీ గ్రామంలో ఒక నాలుగు చిన్న తరహా పరిశ్రమలు చూడవచ్చు.

దళితులకు 3 ఎకరాల సాగుభూమి ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయం. ఇది 70 శాతం కులం సమస్యను పరిష్కరిస్తుంది. ఇది నిజంగా అమలయితె, ఒక 15 సంవత్సరాలలో ఆర్యులు కనిపెట్టిన అంటరానితనం పదం చరిత్రలో కలిసిపోతుంది.  ఒక కొత్త చరిత్ర  లిఖించ బడుతుంది.

ఇప్పుడు అనుసరిస్తున్న పద్దతులను, మార్గాన్ని మరింత పట్టుదలతో, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ, గ్రామం, మండలం, పట్టణం, నగరం ఇలా ఎక్కడి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ప్రణాళికలు రూపొందించుకొని ప్రజలను పూర్తిగా భాగస్వాములను చేస్తూ,  వారికి భరోసా ఇస్తూ పనిచేస్తే నవ తెలంగాణ నిర్మించి అమరుల ఆశయాలను నెరవేర్చిన వాళ్లమౌతాము.

 

– సత్య బత్తుల

President/CEO

NITYA Software Solutions, Inc. California, USA

comment closed

Copyright © 2018 · Indus Heritage Center · All Rights Reserved