Home » Uncategorized » మేధో నైతికత లేని ‘ఆవాహన’

మేధో నైతికత లేని ‘ఆవాహన’

మేధో నైతికత లేని ‘ఆవాహన’
– సి.బి.ఎస్. వెంకటరమణ

 ఒక సమాజంలోని ప్రజలను, జాతి, కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాలపై విడగొట్టి, ప్రేరేపించి, విద్వేషాలను రెచ్చగొట్టడం కష్టం కాదు. ‘సింధు స్ఫూర్తి ఆవాహన’ ప్రతిపాదకుల ప్రధాన ఉద్దేశం ఇటువంటిదేనని వారి విశే ్లషణ స్పష్టంగా చెబుతున్నది. ఇది ఏ మాత్రమూ సమంజసమూ, ఆచరణీయమూ, శ్లాఘనీయమూ కాదు. 

సత్య బత్తుల ప్రభృతుల ‘సింధు స్ఫూర్తి ఆవాహన’ (డిసెంబర్ 2, ఆంధ్రజ్యోతి) చాలా భాగాల మేరకు మేధోనిజాయితీ లోపించిన, సైద్ధాంతిక పక్షపాతం ఘనీభవించిన, ఒక అత్యంత దురదృష్టకరమైన విశ్లేషణ. వ్యాసం మొదటి వాక్యంలోనే జవహర్‌లాల్ నెహ్రూను ‘లిబరల్ బూర్జువా మేధావి’ అని వర్ణించటంలోనే ‘ఆవాహన’ నిర్వాహకుల మేధో సైద్ధాంతిక ఏకపాక్షికత విస్పష్టమైంది.
క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలంలో, అంటే వేదకాలానికి 1500 సంవత్సరాలకు పూర్వమే నెలకొని ఉన్న ‘సింధు నాగరికత’ను, దానికి ఆలవాలమై ఉన్న సుమారు రెండువేల పట్టణాలను ద్రవిడులే నిర్మించారని, వారే ఈ దేశానికి ‘మూలవాసుల’నీ, ఆ నాగరికతను, నగరాలనూ క్రీ.పూ. 1500 సంవత్సరాల ప్రాంతంలో ఆర్యులే నాశనం చేశారని, ఆవాహన వారి వాదన. నిజాలను పాక్షికంగానే పేర్కొనటం, అబద్ధాలను చెప్పటంతో సమానమే. సింధు నాగరికతలోని ప్రజలలో, అక్కడ దొరికిన బొమ్మలు, వగైరాల ఆధారంగా, ద్రవిడ, ఆస్ట్రలాయిడ్ (ఆస్ట్రేలియా ఖండంలోని ఆదిమ జాతి ప్రజలు), మంగోలాయిడ్ (నేటి చైనా, జపాన్, కొరియా వంటి దేశాలలోని అత్యధిక జనాభా ఈ జాతికి చెందినదిగా భావించబడుతున్నది) ప్రజల ఆనవాళ్ళు రూపురేఖలు ఉన్నవని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. రూపురేఖలు, ముఖ కవళికలు, శరీర అవయవ నిర్మాణాకృతుల ఆధారంగా చూస్తే, ఒక మధ్య ఆసియా ప్రాంతం నుంచి ఆర్యులే కాకుండా, హిమాలయ పర్వత సానువుల తూర్పు అంచుల నుంచి మంగోలాయిడ్ జాతి ప్రజలు కూడా బ్రహ్మపుత్ర లోయలోకి, ప్రస్తుత బెంగాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లోకి, వేల సంవత్సరాల నుంచే వచ్చి ఉన్నట్లు తెలుస్తూంది. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో ఈ లక్షణాలు కలిగి ఉండే ప్రజలు అన్ని వర్గాల ప్రజలలోనూ కనిపిస్తారు.

ఐదువేల సంవత్సరాల క్రితమే సింధు నాగరికత ఎంతో ఉన్నతస్థాయిలో రూపుదిద్దుకొన్నది అనటంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. అయితే, ఆ నాగరికతను ‘భారతదేశపు’ మూలవాసులైన ద్రవిడులు నిర్మించారనీ, ‘బయటనుంచి’ వచ్చిన ‘దేశదిమ్మరులైన’ ఆర్యుల దండయాత్రలలో అది నాశనమైంది అని అనటం పూర్తిగా వివేకరహితమూ, అర్థరహితమూనూ. ఎందుకంటే, ‘ఈ ప్రాంతం లేదా ఈ భూభాగం, భారతదేశం’ అనే భావన మూడువేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ భూభాగంలో నివసించిన ప్రజలలో ఉండేది’ అని అనటానికి చారిత్రక ఆధారాలు ఉన్నట్టు లేవు. అంతవరకూ ఎందుకు, ‘హిమాలయాలకు దక్షిణంగా ఉండే ప్రాంతం ఒక దేశమ’నే భావన, ఆ ప్రాంత యావన్మందీ ప్రజలకు గానీ, చిన్నా పెద్దా రాజ్యాలలోని రాజులకు గానీ, క్రీ.పూ. నాలుగవ శతాబ్దంలో అలెగ్జాండరు ఈ ప్రాంతంపై దండెత్తి వచ్చినప్పుడూ కలుగలేదు. 1757లో బ్రిటిషు ఈస్టిండియా కంపెనీ వారు ఈ దేశ రాజకీయ వ్యవహారాలలో జోక్యం కలిగించుకున్నప్పుడూ రాలేదు. మరి, క్రీ.పూ.3వేల సంవత్సరాల నుంచి 1500 సంవత్సరం వరకూ సింధు నాగరికతలో జీవించిన ప్రజలు, తాము ‘భారతదేశాని’కి చెందినట్లుగా భావించారని ఎలా చెప్పగలుగుతాము? వారు భావించారు, లేదా, వారి ‘జాతి మూలాలను’ తమ వారసత్వంగా భావించేవారు కొందరు, కొన్ని సంకుచిత సామాజిక-రాజకీయ ఉద్దేశ్యాలను దృష్టిలో ఉంచుకుని, ‘వారు ఆ విధంగా భావించార ని’, వీరే భావిస్తున్నారా? ఆవాహన బృందం వారి విశ్లేషణ కచ్చితంగా మేధో నైతికతతో చేసినది కాదు.

ఇంకొక మౌలిక అంశంపైన కూడా, ఆవాహన బృందం విశ్లేషణ పూర్తిగా లోపభూయిష్టమైనదిగా భావించవలసి ఉంటుంది. ఆర్యులు అనబడేవారు మధ్య ఆసియా లేదా వేరే ప్రాంతం నుంచి ప్రస్తుత భారతదేశంగా వ్యవహరింపబడే భూభాగంలోకి వలస వచ్చారనే సిద్ధాంతాన్ని కూడా చాలామంది చరిత్రకారులు విశ్వసించటం లేదు. కారణం, ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించినది ఇంగ్లండు దేశానికి చెందిన చరిత్రకారుడు అయి ఉండటం; ఆ విధంగా సూత్రీకరించటంలో ఆనాటి బ్రిటిషు సామ్రాజ్యవాదానికీ, ఈస్టిండియా కంపెనీవారి వ్యాపార, రాజకీయ భవిష్యత్ ఉదే ్దశ్యాలకు అడ్డుకలగకుండా వత్తాసు పలకాలనే స్వార్థం వారిలో (ఆ చరిత్రకారుడిలో) బలంగా ఉండే అవకాశం ఉండటం. అంతేకాక, గత అర్ధశతాబ్దకాలంలో, వామపక్ష భావజాలానికి గాఢంగా అనురక్తులైన కొందరు చరిత్రకారులు, కేవలం ఈ దేశంలోనేకాక ప్రపంచం మొత్తం మీద, వారి చరిత్రాధ్యయనాన్ని శాస్త్రీయమైన దృక్పథంతో కాకుండా, వామపక్ష రాజకీయ ఉద్దేశాలకు లోబరచి చేశారనే స్థూలమైన అభిప్రాయం కూడా ఉన్నది. ఇవన్నీకాక, ఇటీవలే ప్రచురితమైన ఒక ‘మానవ అవశేషాల జన్యు ఆధారిత’ చారిత్రక పరిశోధన, మానవ జాతిలోని ఒక ప్రముఖ శాఖ, ఇండో-ఆర్యన్ శాఖ, ప్రస్తుత భారతదేశ భూభాగంలోనే ఆవిర్భవించి ఉండవచ్చునని తెలిపింది.
తమ సిద్ధాంతీకరణలో ‘ఆవాహన’ ప్రతిపాదకులు బహుశా విస్మరించిన ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే, మానవ సామాజిక చరిత్రలో, ఆదినుంచీ, గత రెండు లేదు మూడు వందల ఏళ్ళ క్రితం వరకూ, ముఖ్యంగా అతి ప్రాచీన కాలంలో, అంటే, మతం, రాజ్యవ్యవస్థ ఏర్పడకముందు, మానవ సమూహాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళటం సామాన్యమైన విషయమేనని చెప్పాలి. అటువంటి వలసలకు అనేక కారణాలు ఉండి ఉండవచ్చునని చరిత్రకారుల అభిప్రాయం. ప్రకృతి వైపరీత్యాలు, ఆహారం సమృద్ధిగా దొరకకపోవటం, ఇతర సమీప మానవ సమూహాలనుంచి తరచూ దాడులు జరిగి ప్రాణ నష్టం జరగటం, వంటివి.
అదే విధంగా, ఆధునిక చరిత్ర మొదలయ్యేవరకూ, అంటే ఇప్పటికి కేవలం 150 లేదా 200 సంవత్సరాల క్రితం వరకూ కూడా ఒక ప్రాంత రాజ్య వ్యవస్థ, అంటే రాజు, సేనలు, ఇంకొక ప్రాంతంపై దండెత్తి భూభాగాన్ని ఆక్రమించటం, ప్రపంచవ్యాప్తంగా ఉండేది. అంతేకాక, ‘మానవులందరూ సమానమే’ అనే నేటి సామాజిక-రాజకీయ ప్రాథమిక సూత్రం కేవలం గత వంద లేదా నూటయాభై సంవత్సరాల కాలం నుంచి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుని, ఇప్పుడు మానవ సమాజం యావన్మందికీ అంగీకారమైంది. అంతకు ముందు, మానవ సమాజం ఆవిర్భవించినప్పటినుంచి కొన్ని వేల ఏళ్ళపాటు దాదాపు అన్ని మానవ సమూహాల్లోనూ, అనేక రకాలైన అసమానతలు ఉండేవి. ఈ అంశంపై ప్రాచీన ఆర్యులను వారి జీవన పద్ధతులను అశాస్త్రీయంగా విమర్శించటంలో, చారిత్రక అధ్యయనాసక్తి కన్నా, తమ ప్రస్తుత సామాజిక-రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకోవటం కోసం ప్రస్తుత సమాజంలోని భిన్న వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నమే ఆవాహకులలో స్పష్టంగా హెచ్చుగా కనిపిస్తున్నది.
ఆవాహన బృందం విశ్లేషణ, ఇంకొక దృక్కోణం నుంచి కూడా పూర్తిగా తర్కరహితంగానూ, అర్థరహింతంగానూ కనిపిస్తుంది. ఇది ఏమిటంటే, సుమారు గత వంద సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం అనుసరిస్తున్న కొన్ని ‘మంచి’ పద్ధతుల, లేదా ‘ఆధునిక సామాజిక భావాల’ ఆధారంగా, సుమారు 3500 సంవత్సరాల క్రితం ‘ఆర్యు’లనబడే కొన్ని మానవ సమూహాలలో, అప్పుడు ఉండిన సామాజిక జీవన విధానాలను, పద్ధతులను పోల్చి విమర్శించటం శాస్త్రీయమైన చరిత్ర-అధ్యయన పద్ధతిపరంగా అశాస్త్రీయమూ, అసమంజసమూ అయిన పద్ధతి. పోలిక అనేది సమకాలీనమైన నాగరికతల మధ్య మాత్రమే ఉండాలి. ఇప్పటి మన మానవ సామాజిక విలువల ఆధారంగా, నాలుగు వేల సంవత్సరాల క్రిందట ఉండిన కొన్ని మానవ సమూహాల పద్ధతులను, వ్యవహారాలను విమర్శించటం, తద్వారా ప్రస్తుత సామాజిక వ్యవస్థలో లబ్ధి పొందాలనుకోవటం, ‘అపరిపక్వ మేధో-గర్వం’ (Immature intellectual arogance) మాత్రమే అని చెప్పాలి.
విశ్లేషణలో చరిత్రపరంగా ఇంకొన్ని వివాదాస్పద విషయాలూ, పరస్పర విరుద్ధ విషయాలూ ఉన్నాయి. ‘ఆర్యులు తమ సమాజాన్ని వర్గీకరించారని, రుగ్వేదంలోని ‘పురుష సూక్తం’ దీనికి ఆధారమనీ’ ఒక వాదన. అయితే, కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, “పురుష సూక్తం’ యజుర్వేద కాలానికి సంబంధించినది; తరువాత కాలంలో, రుగ్వేదంలో ప్రవేశపెట్టబడినది; రుగ్వేదకాలానికి కుల వ్యవస్థ ఏర్పడలేదు; కుటుంబాలలో, తండ్రులు అవలంబించిన వృత్తినే కొడుకులు అవలంబించే పద్ధతి (ఆచరణకు అనువుగా ఉండే కారణం వలన అయి ఉండవచ్చు) ఏర్పడి ఉన్నా, భిన్న కులాలవారు ఒకరింట్లో ఒకరు భోజనం చేసే విషయంలోనూ, వివాహాలలో కన్యలను ఇచ్చి పుచ్చుకోవటంలోనూ ఎటువంటి నిషేధాలు కూడా, రుగ్వేద కాలం నాటికి ఏర్పడి ఉండలేదు’ అనే అభిప్రాయాలు కూడా గమనించాలి.
ఇక ‘ఆవాహన’ రచయితల అభిప్రాయం ప్రకారమే చూసినా, సుమారు క్రీస్తుపూర్వం 1500లో రూపుదిద్దుకొన్నట్లు భావింపబడుతున్న రుగ్వేదంలోని భాగాలను, ఆ తరువాత 1500 సంవత్సరాలు, 2300 సంవత్సరాల కాలంలో రూపుదిద్దుకొన్న బైబిలు, ఖురాన్‌లతో పోల్చి విమర్శించడం, శాస్త్రీయ చారిత్రక అధ్యయనా పద్ధతులను పూర్తిగా విస్మరించటమే.
చివరగా పేర్కొనవలసిన ఇంకొక మౌలిక అంశమూ, అత్యధిక ప్రాముఖ్యత కలిగిన అంశమూ ఉన్నది. ఇది ఏమిటంటే, ‘ఆవాహన’ రచయితలు, ఈనాటి సమాజంలోని కొన్ని వర్గాలను (దళిత, బహుజన, గిరిజన, మైనారిటీలు), తాము (రచయితలు) సిద్ధాంతీకరించిన ‘బ్రాహ్మణీయ సంస్కృతి’పై ‘తిరుగుబాటు’ చేసే విధంగా సమాయత్తపరచే ప్రయత్నంలో భాగంగా, ‘సింధు నాగరికత’ విశ్లేషణను వాడుకున్నారు. ఇది, ఒక విధంగా చూసినట్లయితే, రెండు దశాబ్దాలక్రితం కొన్ని రాజకీయ పక్షాలు, ఎన్నికలలో తమ రాజకీయ లబ్ధికై ‘రామ జన్మభూమి’ అంశాన్ని పైకి తెచ్చి, బాబరీ మసీదును పడగొట్టటం వంటిదేనని చెప్పక తప్పదు.
ఒక సమాజంలోని ప్రజలను, జాతి, కులం, మతం, ప్రాంతం, భాష వంటి అంశాలపై విడగొట్టి, ప్రేరేపించి, విద్వేషాలను రెచ్చగొట్టడం కష్టం కాదు. ‘సింధు స్ఫూర్తి ఆవాహన’ ప్రతిపాదకుల ప్రధాన ఉద్దేశం ఇటువంటిదేనని వారి విశ్లేషణ స్పష్టంగా చెబుతున్నది. ఇది ఏ మాత్రమూ సమంజసమూ, ఆచరణీయమూ, శ్లాఘనీయమూ కాదు. ‘ఆవాహన’ రచయితలే కాకుండా, ఈ అంశంపై ఆసక్తి, అవగాహన ఉన్న పౌరులందరూ కూడా, జాతి, మత, కులాలతోనూ, భాషా ప్రాంత భేదాలతోనూ సంబంధం లేకుండా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

– సి.బి.ఎస్. వెంకటరమణ

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/dec/30/edit/30edit3&more=2012/dec/30/edit/editpagemain1&date=12/30/2012

comment closed

Copyright © 2018 · Indus Heritage Center · All Rights Reserved